Chandrababu: ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే ఎవరికీ ఉపయోగం లేదు: చంద్రబాబు
- గుంటూరులో సభ
- పేదలకు చంద్రన్న కానుకల పంపిణీ
- జగన్ కు పరిపాలన చేతకాదన్న చంద్రబాబు
- రాష్ట్రం వెనక్కి వెళుతోందని విమర్శలు
సీఎం జగన్ కు పరిపాలన చేతకాదని, వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తిరోగమనం చెందుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకంటే రాష్ట్రానికి గానీ, ప్రజలకు గానీ ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు చంద్రన్న కానుకలు పంపిణీ చేసిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "అభివృద్ధి చేయాలి, సంక్షేమం అందించాలి... ఈ రెండింటిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. సంపద సృష్టిస్తే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడీ ముఖ్యమంత్రి చేసే పని బాదుడే బాదుడు. ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో దోచుకుంటున్నాడు. మొన్నటివరకు పేదలకు రూ.2.500 పెన్షన్ చేతుల్లో పెట్టి, మరో చేత్తో రూ.10 వేలు తీసుకున్నాడు.
ఈ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో అవినీతిలో జగన్ నెంబర్ వన్. అవినీతి చక్రవర్తి జగన్ కు పేదల గురించి మాట్లాడే అర్హత ఉందా? టిడ్కో ఇళ్లు పూర్తిచేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
తెలుగువాళ్లు ఎక్కడున్నా జన్మభూమి రుణం తీర్చుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నేనిచ్చిన ఐటీ ఆయుధం ఇప్పుడు వజ్రాయుధంగా తయారైంది అన్నారు. ఉయ్యూరు శ్రీనివాసరావు వంటి వ్యక్తులు ఐటీ నిపుణులై విదేశాలకు వెళ్లి ఆ దేశాల వారికంటే మిన్నగా పనిచేస్తున్నారని, ప్రపంచమంతా మనవాళ్లు రాణిస్తున్నారని కొనియాడారు. "వాళ్లందరికీ నేను పిలుపునిస్తున్నా... ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సి ఉంది. అందరూ రావాలని కోరుతున్నా. ఇక్కడ పేదలు ఉన్నారు... వారికి మీ సేవలు అవసరం... పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది ఎన్టీఆర్ ఆశయం" అని పేర్కొన్నారు.