Jharkhand: ప్రజల ప్రాణాలు తోడేస్తున్న చిరుత వేటకు హైదరాబాద్ షార్ప్ షూటర్ షఫత్ అలీఖాన్!
- ఝార్ఖండ్‌లోని పలామూ డివిజన్‌లో నలుగురు చిన్నారులను చంపేసిన చిరుత
- వణుకుతున్న 50 గ్రామాల ప్రజలు
- షఫత్ అలీని సంప్రదించిన అటవీ అధికారులు
ఝార్ఖండ్‌లోని పలామూ డివిజన్‌లో గత 20 రోజుల్లో నలుగురు చిన్నారులను పొట్టనపెట్టుకున్న చిరుతను బంధించేందుకు హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ సిద్ధమవుతున్నారు. పలామూ డివిజన్‌లోని 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్న ఈ చిరుతను పట్టుకునేందుకు సిద్ధమైన అటవీశాఖ.. సూర్యాస్తమయం తర్వాత ప్రజలెవరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేసింది. చిరుతను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు, చిరుతను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్ నవాబ్ షఫత్‌ను అటవీ అధికారులు సంప్రదించారు. చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని, కుదరని పక్షంలో హతమారుస్తామని అన్నారు. నవాబ్‌ను సంప్రదించామని, ఆయన వద్ద అత్యాధునిక సామగ్రి ఉన్నట్టు ఝార్ఖండ్ చీఫ్ వైల్డ్‌లైప్ వార్డన్ శశికర్ సమంత తెలిపారు. త్వరలోనే ఆయన ఇక్కడికి చేరుకుంటారని పేర్కొన్నారు.