Supreme Court: నోట్ల రద్దు నిర్ణయం చెల్లుతుంది.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- నాటి నిర్ణయాన్ని సవాలు చేస్తూ 58 వ్యాజ్యాలు
- చట్ట ప్రకారమే నిర్ణయమన్న సుప్రీం ధర్మాసనం
- రద్దయిన నోట్ల మార్పిడికి కల్పించిన విండో సహేతుకంగా లేదని చెప్పడం సరికాదని వ్యాఖ్య
2016 నవంబర్ 8న పెద్ద నోట్లను (రూ.500, రూ.1,000) రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం చెల్లుతుందని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు ప్రకటించింది. ఇక ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు నివ్వగా, జస్టిస్ బీవీ నాగరత్న విభేదించారు. డీమోనిటైజేషన్ నిర్ణయంలో ఎలాంటి చట్ట పరమైన, రాజ్యంగ పరమైన లోపాలు లేవని ధర్మాసనం పేర్కొంది.
కాకపోతే రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్పిడి చేసుకునేందుకు కల్పించిన 53 రోజుల విండో సహేతుకంగా లేదని చెప్పరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. 1978 డీమోనిటైజేషన్ సమయంలో రద్దు చేసిన నోట్ల మార్పిడికి 3 రోజుల సమయం ఇచ్చి, దాన్ని మరో 5 రోజులకు పెంచినట్టు పేర్కొంది.
నోట్ల రద్దును సవాలు చేస్తూ 58 వ్యాజ్యాలు దాఖలు కావడం విశేషం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరి కాదంటూ దీన్ని కొట్టివేయాలని పిటిషనర్లు కోరారు. ఇది జరిగిపోయిన నిర్ణయం కనుక, ఈ విషయంలో స్పష్టమైన ఉపశమనం ఇవ్వలేనప్పుడు కోర్టు ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోరాదని ప్రభుత్వం వాదించింది. గడియారాన్ని వెనక్కి తిప్పడం లేదా పగలగొట్టిన గుడ్డును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడంలా ఇది ఉంటుందని పేర్కొంది. జస్టిస్ ఎస్ ఏ నజీర్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 7న వాదనలు పూర్తి చేయగా.. శీతాకాల సెలవుల విరామం తర్వాత తీర్పు ప్రకటించింది.
- విమర్శకులు డీమోనిటైజేషన్ పెద్దగా సక్సెస్ కాలేదని పేర్కొంటున్నారు. కానీ, ఇది చక్కని నిర్ణయమని.. నల్లధనం, ఉగ్రవాదులకు నిధులు అందడం, నల్లధనం, పన్నుల ఎగవేతను నిరోధించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలని కేంద్ర సర్కారు చెబుతోంది.
- స్పల్పకాలిక ఇబ్బందులు అన్నవి జాతి నిర్మాణంలో భాగమని, ఈ సమస్యను తగిన యంత్రాంగాలతో అధిగమనించినట్టు ఆర్ బీఐ తెలిపింది.
- ప్రభుత్వం నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించలేదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు.
- ఆర్ బీఐ సెంట్రల్ బోర్డు సిఫారసు మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
- ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై న్యాయవ్యవస్థ సమీక్షను అమలు చేయరాదన్న అభిప్రాయాన్ని ఆర్ బీఐ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. దీనికి కోర్టు స్పందిస్తూ.. ఆర్థిక నిర్ణయం అని చెప్పి న్యాయవ్యవస్థ తన చేతులు కట్టుకుని కూర్చోదన్నారు.
- డీమోనిటైజేషన్ ప్రభుత్వ వైఫల్యమన్నది ప్రతిపక్షాల ఆరోపణ. వ్యాపారాలు దెబ్బతిని ఉపాధికి నష్టం ఏర్పడినట్టు పేర్కొంటున్నాయి.