Pawan Kalyan: 85 ఏళ్ల వయసులో దీక్ష చేస్తున్నారు.. చాలా ఆందోళన చెందుతున్నా: పవన్ కల్యాణ్
- నిరాహారదీక్షకు దిగిన హరిరామ జోగయ్యను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ప్రభుత్వం తక్షణం స్పందించాలని పవన్ డిమాండ్
- ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు చేపట్టాలన్న జనసేనాని
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహారదీక్షకు దిగిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 11 గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న దాదాపు 400 మంది పోలీసుల భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్సులోకి ఎక్కించి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనను చూసేందుకు ఆసుపత్రిలోకి ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ... 'కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గారు కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. 85 సంవత్సరాల వయసులో ఆయన దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నాను. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం తక్షణం చర్చలు చేపట్టాలి' అని చెప్పారు.