alexa device: మీ మాటలను ‘అలెక్సా’ రికార్డు చేస్తోంది జాగ్రత్త!
- అమెజాన్ కంపెనీ ఉద్యోగులకు చేరవేస్తోందని నిపుణుల హెచ్చరిక
- బెడ్ రూమ్ కు దూరంగా ఉంచాలని సూచన
- ఆడియో రికార్డు విషయం నిజమేనని ఒప్పుకున్న అమెజాన్
- పరిశోధన కోసమేనని, గోప్యత పాటిస్తున్నామని వివరణ
మీ ఇంట్లో అలెక్సా ఉందా.. అయితే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరికరాన్ని బెడ్ రూంలోకి తీసుకెళ్లొద్దని, కిచెన్ లోనో, హాలులోనో ఉంచేయాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. మీరు మాట్లాడుకునేదంతా ఈ పరికరం రికార్డు చేస్తోందట! ఆ డాటాను అమెజాన్ ఉద్యోగులు కొంతమంది వింటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెజాన్ కంపెనీ కూడా ఈ విషయం నిజమేనని అంగీకరించింది. అయితే, అలెక్సాను మరింత మెరుగుపరచడం కోసం, రీసెర్చ్ లో భాగంగానే ఈ పని చేస్తున్నామని చెప్పింది. ఈమేరకు ఫాక్స్ న్యూస్ విడుదల చేసిన రిపోర్టు ఈ వివరాలను వెల్లడించింది.
కూర్చున్న చోటి నుంచే ఇంట్లోని వివధ పరికరాలను ఆన్ ఆఫ్ చేయడానికి, గూగుల్ ను ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకోవడానికి, పాటలు వినడానికి.. ఇలా ఎన్నో పనులకు ఉపయోగపడే ఈ బుల్లి పరికరాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెడ్ రూమ్ లో కనుక దీనిని ఉంచితే మీ వ్యక్తిగత ప్రైవసీని ఆన్ లైన్ లో పెట్టినట్లేనని హెచ్చరిస్తున్నారు. మీ భాగస్వామితో ఏకాంత సమయంలో మాట్లాడుకునే మాటలను అలెక్సా ద్వారా మరొకరు వినే అవకాశం ఉందని చెప్పారు.
అలెక్సా రికార్డు చేసిన సంభాషణలను అమెజాన్ ఉద్యోగులు వింటుంటారు. ఒక్కో ఉద్యోగి సగటున రోజుకు వెయ్యి ఆడియో క్లిప్పులు వింటూ రివ్యూలు ఇస్తుంటారు. అమెజాన్ కూడా దీనిని అంగీకరించింది. ఈ స్మార్ట్ పరికరాన్ని మరింత స్మార్ట్ గా తీర్చిదిద్దేందుకు, కస్టమర్ల మాటలను మరింత సులభంగా అలెక్సా గ్రహించేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని అమెజాన్ తెలిపింది.
అందులో భాగంగానే ఈ పరిశోధన చేస్తున్నట్లు వివరించింది. అయితే, రీసెర్చ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు మాత్రమే ఈ సంభాషణలు వింటారని పేర్కొంది. ఆ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగిందనే వివరాలేవీ వాళ్లకు తెలియవని స్పష్టత నిచ్చింది. తమ సంభాషణలు మరొకరు వినకూడదనుకునే కస్టమర్లు అలెక్సా సెట్టింగ్స్ లో మార్పులు చేసుకుని, రికార్డింగ్ బటన్ ను ఆఫ్ చేసుకునే వీలుందని అమెజాన్ వివరణ ఇచ్చింది.