Harish Rao: సిద్ధిపేట వెంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి హరీశ్ రావు
- ఇవాళ వైకుంఠ ఏకాదశి
- వెంకటేశ్వరస్వామి కోసం 1.792 కిలోల కిరీటం తయారీ
- కిలో బంగారం సమకూర్చిన ఆలయ వర్గాలు
- మిగిలిన బంగారం అందించిన హరీశ్ రావు, ఇతర దాతలు
ఇవాళ వైకుంఠ ఏకాదశి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు వెంకటేశ్వరస్వామి వారి పట్ల భక్తిప్రపత్తులు చాటుకున్నారు. సిద్ధిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటం సమర్పించారు.
ఈ కిరీటం తయారీలో ఆలయ వర్గాలతో పాటు హరీశ్ రావు కూడా పాలుపంచుకున్నారు. ఈ స్వర్ణ కిరీటం బరువు 1.792 కిలోలు కాగా, ఇందులో కిలో బంగారం ఆలయ వర్గాలు కొనుగోలు చేయగా, మిగిలిన బంగారం హరీశ్ రావు తదితర దాతలు సమకూర్చారు. ఈ పసిడి కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా.
ఇవాళ సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన మంత్రి హరీశ్ రావు... కిరీటాన్ని ఆలయ పీఠాధిపతికి అందించారు. స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.