Chinthamaneni Prabhakar: ఏం తప్పు చేశానని పోలీసులు నా చొక్కా చించేశారు?: చింతమనేని
- రేపు చింతమనేని పుట్టినరోజు
- ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద రక్తదాన శిబిరం
- ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన చింతమనేని
- అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన చొక్కా చించివేశారంటూ నిప్పులు చెరిగారు. రేపు చింతమనేని ప్రభాకర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏలూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చింతమనేని నేడు ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు రాగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు తన చొక్కా చించివేశారంటూ చింతమనేని మండిపడ్డారు. చిరిగిన చొక్కాతోనే ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. చిరిగిపోయిన తన చొక్కాను మీడియాకు ప్రదర్శించారు.
ఏం తప్పు చేశానని నా చొక్కా చించేశారు? అంటూ నిలదీశారు. తన పట్ల డీఎస్పీ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనుకోవడం నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. హరిరామజోగయ్య అదే ఆసుపత్రిలో ఉన్నారన్న కారణంతో తనను అడ్డుకున్నారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి... అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శించారు.
తనపై ఇప్పటికే 31 కేసులు పెట్టారని, అయినా భయపడేది లేదని స్పష్టం చేశారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని హెచ్చరించారు.