Iss: కొత్త ఏడాది, సూర్యోదయం రెండూ ఒకే సమయంలో వస్తే.. వీడియో ఇదిగో!
- అత్యంత అరుదైన ఈ క్షణాలను కెమెరాలో బంధించిన జపాన్ వ్యోమగామి
- అంతరిక్షం నుంచి వీడియో తీసి పంపిన కొయిచీ వకాటా
- ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న కొయిచీ
కొత్త ఏడాదిలో మొదటి రోజు సూర్యోదయాన్ని చూడడం ప్రతిసారీ ప్రత్యేకమే! అర్ధరాత్రి క్యాలెండర్ మారాక సంబరాలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, తెల్లవారాక సూర్యుడిని స్వాగతిస్తూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడం మరొక ఎత్తు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం, తొలి సూర్యోదయం.. రెండూ ఒకేసారి జరిగితే? అదెలా సాధ్యమని అనిపిస్తోందా.. ఈ అద్భుత ఘట్టాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా చెబుతున్నారు. ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న కొయిచీ.. కొత్త సంవత్సరాన్ని తొలి సూర్యోదయంతో స్వాగతించారు. ఈ అరుదైన వీడియోను అంతరిక్ష కేంద్రం నుంచి తీసి పంపించారు.
మానవజాతి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కొత్త ఏడాది, తొలి సూర్యోదయం రెండూ ఒకే సమయంలో తాను చూస్తున్నానంటూ కొయిచీ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్టు చేశారు. ఇది నిజంగా అద్భుతమేనని ట్విట్టర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షం నుంచి సూర్యోదయాన్ని చూడడమే గొప్ప అనుభూతి అంటే.. కొత్త సంవత్సరం, ఆ ఏడాది తొలి సూర్యోదయాన్ని ఒకేసారి స్వాగతించడం అత్యద్భుతమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొయిచీ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.