rusk: పాలు, టీలో వేసుకునే రస్క్ తో రిస్క్.. మధుమేహానికి దగ్గరి దారి!
- పూర్తి మైదా, చక్కెరతో వీటి తయారీ
- రోజువారీ వినియోగంతో రక్తంలో అధిక గ్లూకోజ్, ఇన్ ఫ్లమేషన్
- ఇందులో వాడే ఆయిల్, కలర్ తోనూ నష్టమే
- 100 శాతం వీట్ రస్క్ తీసుకోవచ్చు
రస్క్ రుచి వేరు. ఎక్కువ మంది టీలో ముంచుకుని డ్రై బ్రెడ్ పీసెస్ (రస్క్)ను తింటుంటారు. దీనివల్ల వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది. పాలు లేదా టీలో వేసుకుని అప్పటికప్పుడు వెంటనే తినడానికి అనుకూలంగా ఉండే వీటి వినియోగం ఎక్కువగానే ఉంటోంది. కానీ, రస్క్ ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అని ఒక్కరూ ఆలోచించడం లేదు.
కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండే మైదా పిండితో తయారయ్యేవి ఇవి. పైగా కొంత చక్కెరను జోడిస్తారు. పామోలీన్ ఆయిల్ వినియోగిస్తారు. వీటిని నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్ లు కూడా కలుపుతారు. వీటిల్లో ఒక్కటీ మంచి చేసేది లేదు. ఎక్కువగా తింటే అనారోగ్యం ఖాయం. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడంతోపాటు, ఇన్ ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు దీని వినియోగంతో మధుమేహం సమస్య ఎదురవుతుంది. పేగులలో చెడు బ్యాక్టీరియాను ఇది ప్రోత్సహిస్తుంది. దీంతో వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. బరువు పెరగడానికి, మరింత ఆహారం తీసుకోవడానికి కూడా కారణమవుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీటిల్లో కలిపే రంగుతోనూ నష్టమే. కారామెల్ కలర్ లేదా బ్రౌన్ ఫుడ్ కలర్ ను ఉపయోగించడం వల్ల రస్క్ కు ఆ రంగు ఏర్పడుతుంది. రస్క్ తయారీకి నిజమైన గోధుమలను ఉపయోగించినట్టు భ్రమ పడేందుకే ఈ రంగును ఉపయోగిస్తారు.
ప్రత్యామ్నాయాలు
చానా లేదంటే రోస్టెడ్ మకానాను స్నాక్ గా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ రస్క్ ఇష్టంగా తినాలని భావించే వారు.. నూరు శాతం హోల్ వీట్ తో చేసినవి లేదంటే 100 శాతం సెమోలినా తో చేసిన రస్క్ తీసుకోవచ్చు. రస్క్ ప్యాకెట్ పై ఇంగ్రేడియంట్స్ లో ఈ వివరాలు ఉంటాయి.