GRMB: ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం
- హైదరాబాదులో గోదావరి నదీ యాజమాన్య బోర్డు
- పాల్గొన్న ఏపీ ఈఎన్ సీ నారాయణరెడ్డి
- తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు పట్టించుకోవడంలేదని వ్యాఖ్యలు
హైదరాబాదులో ఇవాళ నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ ఈఎన్ సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, గోదావరిలో నీటి లభ్యత, రాష్ట్రాల వాటా తేల్చాలని అడిగామని వెల్లడించారు. నీటి లభ్యతపై కేంద్ర జలసంఘంతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలని బోర్డు నిర్ణయించినట్టు తెలిపారు.
ఇక, తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోవడంలేదని అన్నారు. నీటి లభ్యత ఉండగా గూడెంలో అదనపు ఎత్తిపోతల పథకం ఎందుకని అడిగామని ఈఎన్ సీ నారాయణరెడ్డి వెల్లడించారు. గూడెం ఎత్తిపోతలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పామని తెలిపారు.
టెలీమెట్రీ ఐదు చోట్లే ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరిందని అన్నారు. అయితే టెలీమెట్రీ ఎక్కువచోట్లే ఏర్పాటు చేయాలని తాము కోరామని వివరించారు. పోలవరంపై చర్చకు గోదావరి బోర్డు సరైన వేదిక కాదని చెప్పామని ఆయన వెల్లడించారు. పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలను ఇప్పటికే చర్చించామని తెలిపారు. పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలు, సమస్యలు పరిష్కారం అయినట్టేనని పేర్కొన్నారు.