Anam Ramanarayana Reddy: వెంకటగిరి ఇన్చార్జిగా ఎవరిని నియమిస్తారో అది పార్టీ ఇష్టం: ఆనం రామనారాయణరెడ్డి
- అసంతృప్తి గళం వినిపిస్తున్న ఆనం
- పార్టీ అధినాయత్వం ఆగ్రహంతో ఉందంటూ ప్రచారం
- ఆనంపై వేటు అంటూ కథనాలు
- ఊహాగానాలపై స్పందించబోనన్న ఆనం
గత కొంతకాలంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఆనం ఇవాళ కూడా పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయనపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. ఆనంపై వేటు వేశారని, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ఊహాగానాలను తాను పట్టించుకోనని, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై స్పందించనని స్పష్టం చేశారు. వెంకటగిరి ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమిస్తున్నట్టు తనకు సమాచారం లేదని తెలిపారు. పార్టీ నుంచి తనతో ఎవరూ మాట్లాడలేదని వెల్లడించారు.
మీడియా మిత్రులు ఫోన్ చేసి, వెంకటగిరికి వేరొకరని ఇన్చార్జిగా నియమిస్తున్నారట కదా... మీకేమైనా సమాచారం ఉందా? అని అడిగారని ఆనం వెల్లడించారు. అయితే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాళ్లకు చెప్పానని వివరించారు. ఎవరిని నియమిస్తారన్నది పార్టీ ఇష్టం అని అభిప్రాయపడ్డారు. ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ఆనం వ్యాఖ్యానించారు.
ఇవాళ కూడా తాను సైదాపురంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని వెల్లడించారు. వెంకటగిరి 107 సచివాలయాలు ఉన్న నియోజకవర్గం అని, కొన్ని సచివాలయాల పనులు ఇంకా పూర్తికాలేదని, కొన్ని పనులు ప్రారంభమైన తర్వాత నిలిచిపోయాయని గతంలోనూ చెప్పానని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
పనులు త్వరగా జరగకపోతే మీరు నన్నే అంటారు... అందుకే పనులు పూర్తి చేయండి అని ఆ నిర్మాణాలను పర్యవేక్షించే ఇంజినీర్లకు, తదితరులకు సూచించానని వివరించారు. ఇంతకుమించి వేరే సమాచారం ఏదీ తనవద్ద లేదని ఆనం స్పష్టం చేశారు.
టీవీ స్క్రోలింగులు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు జవాబు చెప్పడానికి తనకు ఎలాంటి అవకాశం కూడా లేదని వ్యాఖ్యానించారు. తెలియని విషయాలపై ఎలా మాట్లాడగలనంటూ ప్రశ్నించారు.