Russia: మొబైల్ వాడకమే ఆ 89 మంది ప్రాణం తీసింది..: రష్యా

use of mobile phone caused 89 soldiers death says russia
  • కొత్త ఏడాది నాటి క్షిపణి దాడిలో సైనికుల మరణాలపై రష్యా వివరణ
  • మొబైల్ సిగ్నళ్లను ట్రాక్ చేసి ఉక్రెయిన్ దాడి చేసిందని వెల్లడి
  • ఫోన్లు వాడొద్దన్న ఆదేశాలను సైనికులు ఉల్లంఘించారని వ్యాఖ్య 
  • బాధ్యులపై చర్యలు తప్పవన్న ఆర్మీ
నూతన సంవత్సరం వేళ ఉక్రెయిన్ క్షిపణి దాడిలో పెద్ద సంఖ్యలో తమ సైనికులు మరణించడంపై రష్యా స్పందించింది. ఈ దాడిలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం తమ సైనికులు మొబైల్ ఫోన్లు వాడడమేనని వివరించింది. ఈమేరకు రష్యా రక్షణ శాఖ బుధవారం ఓ వీడియో విడుదల చేసింది. ఉక్రెయిన్ బార్డర్ కు దగ్గరగా ఉన్న రష్యా సైనిక శిబిరంపై ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. కొత్త సంవత్సరం తొలి రోజే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు వంద మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ చెప్పింది. అయితే, చనిపోయిన సైనికులు 89 మంది అని రష్యా పేర్కొంది.

బార్డర్ కు దగ్గరగా ఉండడంతో మొబైల్ ఫోన్లు వాడొద్దని శిబిరంలోని సైనికులకు ఆదేశాలు జారీ చేసినట్లు రష్యన్ ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన సైనికులు.. కొత్త ఏడాది సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులతో ఫోన్లో మాట్లాడారని వివరించారు. ఈ మొబైల్ ఫోన్ల సిగ్నళ్లను ట్రాక్ చేసి, సైనికులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన ఉక్రెయిన్.. క్షిపణుల వర్షం కురిపించిందని తెలిపారు. కచ్చితత్వంతో జరిగిన ఈ దాడిలో రష్యా పెద్ద మొత్తంలో సైనికులను కోల్పోయినట్లు వివరించారు.

ఈ దాడిలో చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది సైనికులు ఇటీవలే యుద్ధంలో చేరారని రష్యా లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ సెవ్ర్యకోవ్ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సైనికులపై చర్యలు తప్పవని ఆ వీడియో సందేశంలో సెర్గీ స్పష్టంచేశారు.
Russia
Ukraine
war
missile attack
89 soldiers dead

More Telugu News