children: చిన్నారుల ఎముకలు డొల్ల కానీయకండి..!
- ఎముకల వృద్ధి ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి
- తగిన పోషకాలతో కూడిన సమతులాహారం అవసరం
- పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి
ఆరోగ్యకరమైన జీవనశైలి పెద్దవాళ్లకే కాదు పిల్లలకూ అవసరమే. పోషకాహారం తీసుకునే విధంగా, నచ్చిన క్రీడల్లో పాల్గొనే విధంగా వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తుండాలి. పిల్లల ఎదుగుదలలో ఎముకల పాత్ర ప్రత్యేకమైనది. దీని గురించి చాలా మందిలో అవగాహన ఉండదు. కానీ, ఎముకల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దన్నది వైద్యుల సూచన.
ఒక వ్యక్తి మంచి ఎత్తు, సరైన ఆకృతిలో ఉండాలంటే అందుకు ఎముకల వృద్ధి ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో అవయవాలను కాపాడే పాత్రను ఎముకలు పోషిస్తాయి. కనుక ఎముకల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. పిల్లలు 18-25 ఏళ్ల వయసులో ఎముకల వృద్ధి పూర్తవుతుంది. బోన్ మాస్ గరిష్ఠ స్థాయికి చేరుతుంది. పిల్లలు పెద్దవుతున్న క్రమంలో ఎముకల వృద్ధి చాలా వేగంగా ఉంటుంది. ఆ వేగానికి సరిపడా పోషకాలు, ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని మర్చిపోవద్దు.
సరైన పోషకాలు లోపించినప్పుడు ఎముకల వృద్ధి సంపూర్ణంగా ఉండదు. ఈ లోపం ఎక్కువగా ఉన్న వారిలో ఎముకలు బలహీనంగా, డొల్లబారి ఉంటాయి. దీంతో వారికి ఫ్రాక్చర్ల రిస్క్ పెరుగుతుంది. ఆస్టియో పోరోసిస్, రికెట్స్ వ్యాధుల ముప్పును ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక పిల్లలకు మంచి పోషకాలు అందిస్తూ, క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
విటమిన్ డీ
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా అవసరం. ప్రతి రోజు 10 నిమిషాల పాటు సూర్యోదయం సమయంలో సూర్యరశ్మి శరీరంపై పడేలా చూడాలి. నేడు ఎండలోకి వెళ్లే అవసరం తగ్గిపోయినందున చాలా మందిలో విటమిన్ డీ లోపిస్తోంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడంలో విటమిన్ డీ పాత్ర కూడా ఉంటుంది. క్యాల్షియం ఎముకలకు అందాలంటే విటమిన్ డీ కావాలి.
క్యాల్షియం
విటమిన్ డీతో పాటు, పిల్లలకు కావాల్సిన పరిమాణంలో క్యాల్షియం కూడా అందించాలి. ఎముకలు పూర్తి స్థాయిలో పెరిగేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు క్యాల్షియం అవసరం. పాలు, పెరుగు, పాల ఉత్పత్తుల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. రోజూ రెండు గ్లాసుల పాలు అందించాలి. కనీసం ఒకటి నుంచి రెండు కప్పుల పెరుగు తినిపించాలి. సోయా ఉత్పత్తులు, చేపలను కూడా తినిపించొచ్చు.
విటమిన్ కే
ఎముకల నిర్మాణానికి క్యాల్షియం, విటమిన్ డీతోపాటు మెగ్నీషియం, విటమిన్ కే కూడా అవసరం. ఎముకల బలానికి ఇవి తోడ్పడతాయి. పాలకూర, క్యాబేజీ, మొలకెత్తిన గింజలు, పప్పు ధాన్యాలను ఇవ్వడం ద్వారా వీటి లోపం లేకుండా చూసుకోవచ్చు.
శారీరక చర్యలు
పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్లకు కానీ, టీవీలకు కానీ అతుక్కుపోకుండా చూడాలి. ఇంట్లో వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహించాలి. క్లైంబింగ్, వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, షటిల్, క్రికెట్ ఇలా వారికి నచ్చిన క్రీడ కోసం రోజూ కొంత సమయం వెచ్చించేలా చూసుకోవాలి.