Team India: అశ్విన్ లా చేయబోయి అభాసుపాలైన ఆస్ట్రేలియా స్పిన్నర్
- బిగ్ బాష్ లీగ్ లో మన్కడింగ్ కు ప్రయత్నించిన ఆడమ్ జంపా
- బౌలింగ్ పూర్తి చేసేటప్పుడు భుజం పొజిషన్ సరిగ్గా లేకపోవడంతో నాటౌట్ ఇచ్చిన అంపైర్
- అశ్విన్ తో పోల్చుతూ జంపాపై సోషల్ మీడియాలో సెటైర్లు
భారత సీనియర్ స్పిన్నర్ మాదిరిగా నాన్ స్ట్రయికర్ ఎండ్ లో బ్యాటర్ ను రనౌట్ చేయబోయిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అభాసుపాలయ్యాడు. బిగ్ బాష్ లీగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ లీడ్ లో జంపా మెల్ బోర్న్ స్టార్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. స్టార్స్, మెల్ బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తుండగా జంపా.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో బ్యాటర్ రోజర్స్ క్రీజు దాటాలని చూశాడు. దాంతో, బౌలింగ్ పూర్తి చేయకుండా బంతితో వికెట్లను గిరాటేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఇలా చేయడాన్ని ఇది వరకు మన్కడింగ్ అనేవారు. అయితే, ఐసీసీ దీన్ని కూడా రనౌట్ గా మార్చింది.
కాగా, జంపా రనౌట్ కోసం అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔటివ్వలేదు. దాంతో, స్పిన్నర్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించగా.. అంపైర్ థర్డ్ అంపైర్ కు నివేదించాడు. రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్.. జంపా బౌలింగ్ ను పూర్తి చేసేటప్పుడు తన చేతిని నిలువు దశ నుంచి ముందుకెళ్లడంతో రనౌట్ ఇవ్వడం లేదని ప్రకటించాడు. అంతే, జంపాపై సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. మన్కడింగ్ పక్కాగా ఎలా చేయాలో అశ్విన్ ను చూసి నేర్చుకోవాలంటూ అతనికి సూచనలు చేశారు. ఐపీఎల్ 2023లో ఒకే టీమ్ కు ఆడబోతున్న జంపా, అశ్విన్ ఫొటోలతో సోషల్ మీడియాలో చాలా రకాల మీమ్స్ మొదలయ్యాయి.