YSRCP: విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్.. ప్రకటించిన జగన్
- విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో జగన్ సమీక్ష
- కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడిన జగన్
- వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు తిరుగుండదన్న సీఎం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేది ఎవరో స్పష్టత వచ్చేసింది. ఆ స్థానం నుంచి దేవినేని అవినాష్ బరిలోకి దిగుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఈ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేత గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన ఆయనను ఈసారి ఎదురొడ్డాలంటే నియోజకవర్గంలో మంచి పట్టున్న దేవినేని కుటుంబంతోనే సాధ్యమవుతుందని భావించిన జగన్.. అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలుస్తోంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అక్కడి నేతలతో సమీక్ష నిర్వహించిన జగన్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం అవినాష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 సంవత్సరాలు వైసీపీకి తిరుగుండదని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని జగన్ దిశానిర్దేశం చేశారు.