Chandrababu: మహిళా పోలీసులపై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు

Women police association leaders complains against Chandrababu to state women commission

  • వినతిపత్రం సమర్పించిన మహిళా పోలీస్ సంఘం నేతలు 
  • చంద్రబాబు తీరు గర్హనీయమన్న వాసిరెడ్డి పద్మ
  • తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ గ్రామ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసులపై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించింది. 

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ డి. మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ఎంవీఎన్. దుర్గ, గౌస్యా బేగం, మంగళగిరి గీత తదితరులు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అమరావతిలోని కార్యాలయంలో ఈరోజు కలిసి వినతి పత్రం అందజేశారు. 

దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ, మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం, సామాజిక అంశాలపై చైతన్యం తదితర అంశాలపై గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు మహిళా సాధికారతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. 

సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం, గ్రామస్థాయిలో మహిళా భద్రత విషయంలో పదిమందికీ ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థ పనితీరుపై, వారు చేస్తున్న సర్వేలపై అబద్ధాలను ప్రచారం చేస్తూ... వారికి సహకరించవద్దని, వారు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్యాభర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారని ప్రజల్లో భ్రమ కలిగే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించవలసిందేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. 

అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం మహిళా పోలీసులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అన్నారు.

  • Loading...

More Telugu News