Kodumur: కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌పై సోదరుడు సుదర్శన్ తీవ్ర ఆరోపణలు
- టీడీపీ నేత విష్ణువర్ధన్‌ను కలిసిన జె.సుదర్శన్
- సోదరుడు సుధాకర్‌ను నమ్మక ద్రోహిగా అభివర్ణించిన వైనం
- కోడుమూరు ప్రజలనే కాకుండా కుటుంబ సభ్యులను కూడా మోసం చేశాడన్న సుదర్శన్
- ఆయన గెలుపు కోసం రూ. 30 లక్షలు ఖర్చు చేశానని వెల్లడి
- ఆ డబ్బులు అడుగుతాననే దూరం పెట్టాడని ఆరోపణ
కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్‌పై ఆయన సోదరుడు జె.సుదర్శన్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్‌రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. సోదరుడిపై విరుచుకుపడ్డారు. సుధాకర్‌ను నమ్మకద్రోహిగా అభివర్ణించారు. ఆయనకు స్వప్రయోజనాలు తప్ప మరేవీ పట్టవన్నారు. ఆయనను నమ్మి కోడుమూరు ప్రజలే కాకుండా కుటుంబ సభ్యులం కూడా మోసపోయామన్నారు. సుధాకర్ తనకు స్వయానా తమ్ముడని, మూడు దశాబ్దాలపాటు తామిద్దరం టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి అనుచరులుగా ఉన్నామన్నారు.
డాక్టర్ చదివిన తన సోదరుడు స్థిరాస్తి వ్యాపారంలో బాగా సంపాదించి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కోడుమూరు టికెట్ సంపాదించుకున్నారని గుర్తు చేశారు. దీంతో తాము కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరామన్నారు. ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డామన్నారు. సోదరుడి గెలుపు కోసం తాను స్వయంగా రూ. 30 లక్షలు ఖర్చు చేశానని, ఆ డబ్బులు అడుగుతానని ఇప్పుడు తనను దూరం పెట్టాడని ఆరోపించారు.
చివరికి తన ఆఖరు కుమార్తె పెళ్లికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసకారిని తన జీవితంలోనే చూడలేదన్నారు. ఏడాది క్రితం హైదరాబాద్‌లో పత్తికొండ నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు కేఈ శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరినట్టు చెప్పిన ఆయన కోడుమూరు టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి గెలుపు కోసం కృషి చేస్తామని సుదర్శన్ తెలిపారు.