Chegondi Harirama Jogaiah: టీడీపీ, జనసేన ఓట్లను చీల్చేందుకే ఏపీలోకి బీఆర్ఎస్: హరిరామ జోగయ్య
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హరిరామ జోగయ్య తీవ్ర వ్యాఖ్యలు
- పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ పరోక్షంగా సహకరించారని ఆరోపణ
- హైదరాబాద్ సచివాలయంలో ఏపీ భవనాన్ని స్థలంతోపాటు అప్పగించేశారని విమర్శ
- జగన్‌కు మేలు చేసేందుకే కేసీఆర్ ఏపీలో కాలుమోపుతున్నారని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా జగన్‌కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అడుగుపెడుతోందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ సచివాలయంలో ఏపీకి చెందిన భవన సముదాయాన్ని స్థలంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.
ఢిల్లీలోని ఏపీ అతిథిగృహంలో తమ వాటా భూములతో కూడిన భవనాలను కూడా ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు జగన్ పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. జగన్ మరోమారు అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ సహకరిస్తున్నారని, అందులో భాగంగానే బీఆర్ఎస్ పేరుతో ఏపీలో అడుగుపెడుతున్నారని హరిరామ జోగయ్య అన్నారు.