Chandrababu: మరో ప్రభుత్వం అయితే హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సిగ్గుతో ఉరేసుకుని చచ్చేది: చంద్రబాబు
- కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
- పెన్షన్ చెల్లించకుండా పింఛన్ దారులను జేబు దొంగలుగా మారుస్తారా? అని మండిపాటు
- ఎస్పీ కార్పొరేషన్ నిధులను నవరత్నాలకు మళ్లించడంపై అభ్యంతరం
ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. మరో ప్రభుత్వం అయితే రాష్ట్ర హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సిగ్గుతో ఉరేసుకుని చచ్చేదని ఆయన అన్నారు.
ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు దొంగలుగా మారుతున్నారని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకపోతే వృద్ధాప్యంలో మందుల కోసం వారు డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారని ప్రశ్నించింది. పెన్షన్ చెల్లించకుండా పింఛన్ దారులను జేబు దొంగలుగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని మంత్రులు అసెంబ్లీలో ప్రకటిస్తున్నారని... అలాంటప్పుడు కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పెన్షన్ దారులకు బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించింది.
డబ్బుల కోసం ప్రతి ఒక్కరూ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని హైకోర్టు నిలదీసింది. అధికారులను కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తే తప్ప బిల్లులు చెల్లించరా? అని మండిపడింది. తప్పుడు వివరాలు ఇస్తూ కోర్టును కూడా మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ కార్పొరేషన్ నిధులను నవరత్నాలకు మళ్లించడంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశమే నెరవేరనప్పుడు దాన్ని మూసివేయడమే మంచిదని వ్యాఖ్యానించింది.