Bandi Sanjay: అంతా సిద్ధంగా ఉండండి.. 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు: బండి సంజయ్
- వచ్చే ఎన్నికల్లో పోలింగ్ బూత్ కమిటీలు కీలకపాత్రను పోషిస్తాయన్న సంజయ్
- మోదీ కూడా బూత్ అధ్యక్షుడిగా వ్యవహరించినవారేనని వెల్లడి
- కేంద్ర నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శ
రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయంలో పార్టీ పోలింగ్ బూత్ కమిటీలు కీలకపాత్రను పోషిస్తాయని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ సైతం పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పని చేశారని చెప్పారు. పార్టీకి పోలింగ్ బూత్ కమిటీలే మూల స్తంభాలని అన్నారు. వచ్చే 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు.
గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ పథకం, స్మార్ట్ సిటీ, హరితహారం కింద కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులను కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీలు చేయకపోవడంతో... రైతుబంధు డబ్బులను బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయాల గురించి కాకుండా... అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు.