Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు... నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన సీబీఐ కోర్టు
- నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన నిందితులు
- ఈ నెల 28 వరకు కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నిందితులకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది.
ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. నేటి విచారణకు వీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. వీరికి గతంలో కోర్టు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగిసింది. దాంతో సీబీఐ అధికారులు వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కాగా, ఈ కేసులో ఆర్థిక అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ నిన్న 13,567 పేజీలతో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం తెలిసిందే. రూ.100 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలపై ఆధారాలను ఈ చార్జిషీట్ లో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఈడీ దీంట్లో 12 మంది పేర్లను పేర్కొంది.