Race Horses: తేనెటీగల దాడిలో రూ. 2 కోట్ల విలువైన గుర్రాల మృత్యువాత!
- గుర్రాల వయసు 10, 15 ఏళ్లు
- మేతకు వెళ్లినప్పుడు చుట్టుముట్టిన వందలాది తేనెటీగలు
- రెండు రోజులపాటు చికిత్స అందించినా ఫలితం శూన్యం
తేనెటీగల దాడిలో 2 కోట్ల రూపాయల విలువైన రెండు రేసు గుర్రాలు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని తుముకూరు జిల్లా కుణిగల్ స్టడ్ ఫామ్లో జరిగిందీ ఘటన. ఫామ్ మేనేజర్ డాక్టర్ దినేశ్ ఎన్ఎం కథనం ప్రకారం.. ఈ రెండు గుర్రాల్లో ఒకదాని వయసు 10 ఏళ్లు కాగా, మరో దాని వయసు 15 ఏళ్లు. వీటిని అమెరికా, ఐర్లాండ్ నుంచి తీసుకొచ్చారు. మేతకోసం విడిచిపెట్టిన సమయంలో గురువారం వీటిపై వందలాది తేనెటీగలు దాడిచేశాయి.
తీవ్రంగా గాయపడిన వీటికి పశువైద్యులు రెండు రోజులపాటు చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాయి. 480 ఎకరాల్లో విస్తరించిన తమ ఫామ్లో ఎక్కడా తేనెపట్లు లేవని, చుట్టుపక్కల ఎక్కడో ఉంటే కదపడంతో తేనెటీగలు ఇలా దాడి చేసి ఉంటాయని డాక్టర్ దినేశ్ అనుమానం వ్యక్తం చేశారు.