Umran Malik: ఉమ్రాన్ ఫాస్ట్ బౌలింగ్ కు గాల్లో ఎగిరిపోయిన స్టంప్
- శ్రీలంకతో మూడో టీ20లో రెండు వికెట్లు తీసిన ఉమ్రాన్
- 146 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతికి ఎగిరి పోయిన స్టంప్
- మహేష్ తీక్షణ అవుట్
భారత ఫాస్ట్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎంత వేగంగా బంతులు సంధిస్తాడన్నది తెలిసిందే. ఎప్పటి మాదిరే శ్రీలంకతో జరిగిన మూడో టీ20లోనూ ఈ యువ పేసర్ తన తడాఖా చూపించాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. సుమారు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేస్తాడు కనుక బ్యాటర్ కొంచెం గట్టిగా కొట్టినా సునాయాసంగా సిక్సర్ గా మారుతుంది. అదే సమయంలో స్టంప్స్ కు తాకితే ఎగిరి పడిపోవాల్సిందే. ఇదే ఘటన మూడో టీ20 మ్యాచ్ లో చోటు చేసుకుంది.
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ను భారత్ రెండు విజయాలతో సొంతం చేసుకోవడం తెలిసిందే. గత రెండు మ్యాచ్ ల్లో బౌలింగ్ తో తీవ్ర మిమర్శల పాలైన అర్షదీప్ సింగ్ మూడో మ్యాచ్ లో మూడు వికెట్లతో మెరిశాడు. పాండ్యా, యజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
వానిందు హసరంగ, మహేష్ తీక్షణ వికెట్లను ఉమ్రాన్ సొంతం చేసుకున్నాడు. మహేష్ తీక్షణ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 146 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ బంతిని సంధించాడు. అతడు ఎంతో కచ్చితత్వంతో బౌలింగ్ చేయడంతో.. అది వెళ్లి స్టంప్స్ ను తాకింది. ఆ వేగానికి స్టంప్ గాల్లో ఎగిరి పోవడంతో ఉమ్రాన్ ఆనందానికి హద్దుల్లేవు. ఈ సిరీస్ లో ఉమ్రాన్ మొత్తం ఏడు వికెట్లు తీశాడు.