Roja: చంద్రబాబుతో పవన్ భేటీపై రోజా స్పందన

Roja opines on Chandrababu and Pawan Kalyan meeting

  • హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్
  • దాదాపు రెండున్నర గంటల పాటు భేటీ
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మంత్రులు
  • ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అంటూ రోజా వ్యాఖ్యలు

హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య భేటీ జరగడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. దీనిపై మంత్రి రోజా స్పందించారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ ను పరామర్శిస్తాడని... చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కల్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని రోజా విమర్శించారు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా..! అంటూ రోజా ట్వీట్ చేశారు. 

ఇదే అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా స్పందించారు. బాబూ... జీ హుజూర్... అనడానికే పవన్ కల్యాణ్ నేడు చంద్రబాబు ఇంటికి వెళ్లారని ఎద్దేవా చేశారు. నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేయమంటే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాను, నువ్వు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పడానికే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

చంద్రబాబు, పవన్ భేటీ నేపథ్యంలో మరో మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కందుకూరు, గుంటూరులో చనిపోయిన వారిని పరామర్శిస్తాడు... కానీ చంద్రబాబును పరామర్శించడం ఏంటి? అని ప్రశ్నించారు. 

"అక్కడ అభం శుభం తెలియని అమాయకులు చనిపోయారు. బాధ్యత ఉన్న రాజకీయనాయకుడైతే బాధితుల వద్దకు వెళ్లి వారికి ధైర్యం ఇవ్వాలి. కానీ కుప్పంలో డ్రామాలు ఆడిన చంద్రబాబు ఇంటికి వెళ్లాడు. చంద్రబాబుకు ఏం జరిగిందని పవన్ ఆయన ఇంటికి వెళ్లాడు?" అని జోగి రమేశ్ నిలదీశారు. సంక్రాంతి ప్యాకేజి కోసమే పవన్ కల్యాణ్ ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్లాడని విమర్శించారు. 

కాగా, చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీని స్వాగతించారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయవాదంతో బీఆర్ఎస్ గా మారిందని, ఏ పార్టీ ఎక్కడ్నించి అయినా పోటీ చేయొచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News