Chiranjeevi: ఏ విషయంలోనైనా చిరంజీవి బాధపడతారేమోగానీ... బయటపడరు: రవితేజ
- ఘనంగా జరిగిన 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్
- చిరంజీవిని చూసే ఇండస్ట్రీకి వచ్చానన్న రవితేజ
- అదే మెగాస్టార్ గొప్పతనమంటూ వ్యాఖ్య
- తన కోరిక నెరవేరిందంటూ హర్షం
చిరంజీవి .. రవితేజ ఇద్దరూ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా ఎదిగినవారే. చిరంజీవి అభిమానిగా ఆయన స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ, ఆయనతో కలిసి చేసిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో రవితేజ మాట్లాడుతూ .. "చిరంజీవి అభిమానిగా నా ప్రయాణం విజయవాడ నుంచి మొదలైంది. అప్పట్లో విజయవాడలో చిరంజీవిగారి 'విజేత' సినిమా ఫంక్షన్ జరిగితే, దగ్గర నుంచి కూడా నేను చూడలేకపోయాను" అన్నారు.
"ఆ రోజున చిరంజీవిగారి పక్కనే భానుప్రియ కూర్చున్నారనుకుంటాను. 'ఏదో ఒకరోజు నేను చిరంజీవిగారి పక్కన కూర్చుంటాను' అని నా ఫ్రెండ్స్ తో అన్నాను. విజయవాడలో నేనన్న మాటను కూడా దాటేసి ఈ రోజున నేను ఆయన చంకనెక్కి కూర్చున్నాను. అంతగా ఆయన నన్ను ఇష్టపడతారు .. ప్రేమించారు" అని చెప్పారు.
"చిరంజీవిగారి గురించి నేను చెప్పదలచుకున్నది బాబీ చెప్పేశాడు. ఏ విషయంలోనైనా అన్నయ్య బాధపడతారేమోగానీ .. బయటపడరు. వేరే వారిని గురించి ఆయన నెగెటివ్ గా మాట్లాడటం నేను వినలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ను ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అప్పుడు సక్సెస్ మీట్లో కలుసుకుందాం" అంటూ చెప్పుకొచ్చాడు.