Chanda kochhar: చందాకొచ్చర్ దంపతులను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు

Not in accordance with law Bombay HC orders release of Chanda Deepak Kochhar
  • నిబంధనలకు అనుగుణంగా అరెస్ట్ చేయలేదన్న కోర్టు
  • మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు
  • విచారణ కీలక దశలో ఉందంటూ సీబీఐ అభ్యంతరం
మోసపూరితంగా రుణాలను మంజూరు చేసిన కేసులో అరెస్ట్ అయిన, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను విడుదల చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేసింది. తమ అరెస్ట్ లు చట్ట విరుద్ధమని ఈ దంపతులు కోర్టులో సవాలు చేసి విజయం సాధించారు. వారం పాటు సీబీఐ కస్టడీలో వున్న వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో ఉన్నారు.

‘‘వాస్తవాల ఆధారంగా చూస్తే పిటిషనర్లను (కొచ్చర్ దంపతులు) చట్టంలోని నిబంధనల మేరకు అరెస్ట్ చేసినట్టు లేదు. వారి విడుదలను అడ్డుకుంటున్న సెక్షన్ 41 (ఏ) విషయంలో నిబంధనలను పాటించినట్టు లేదు. వారి అరెస్ట్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేదు’’ అని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చవాన్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణ మంజూరీ కేసులో డిసెంబర్ 25న కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసింది. తమ కుమారుడు ఈ నెలలో వివాహం చేసుకోనున్న దృష్ట్యా మధ్యంతర ఉపశమనం కల్పించాలని కూడా కొచ్చర్ దంపతులు కోర్టును వేడుకున్నారు. అయితే, అలాంటివేమీ తాము చూడమని, అరెస్ట్ చట్టబద్ధమా? కాదా తేలుస్తామని గత వారం కోర్టు పేర్కొనడం గమనార్హం.

సీబీఐ అరెస్ట్ ఏకపక్షం, చట్టవిరుద్ధమని కొచ్చర్ దంపతుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు వాదించారు. చట్టంలోని సెక్షన్ 46(4) ప్రకారం అరెస్ట్ సమయంలో మహిళా పోలీసు అధికారి లేరని, ఈ నిబంధన పాటించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో పురుష అధికారి ఉన్నారనేది అప్రస్తుతమని, ఇదో పెద్ద వైట్ కాలర్ నేరమని సీబీఐ వాదించింది. విచారణ కీలక దశలో ఉన్నందున, ఈ సమయంలో వారికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ అభ్యంతరం చెప్పింది. కానీ, ఇదే అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోందని, అయినా ఈడీ అరెస్ట్ చేయలేదని, బెయిల్ కూడా ఇచ్చినట్టు కోర్టు ముందు వాదించారు.
Chanda kochhar
deepak kochhar
release
grants bail
Bombay high court

More Telugu News