Chandrababu: అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలి... డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu wrote DGP and ask to stop illegal arrests
  • పలు చోట్ల టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారన్న చంద్రబాబు
  • ఇవి అక్రమ అరెస్టులని ఆక్రోశం
  • డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • తమ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్  
కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీసులే ఫిర్యాదుదారులుగా టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సెక్షన్ 307 దుర్వినియోగం చేసి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని తెలిపారు. 

సెక్షన్ 307 విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతోందని స్పష్టం చేశారు. కుప్పం, పుంగనూరు, మాచర్ల తదితర ప్రాంతాల్లో అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు. 

"పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 307 నమోదు చేయడం, ఆపై ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల జాబితాలో 'ఇతరులు' అని పేర్కొనడం ప్రతి కేసులో జరుగుతోంది. ఇలాంటి అనైతిక, చట్ట విరుద్ధమైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పోలీసులు టీడీపీ కార్యకర్తలను విచక్షణారహితంగా అరెస్టు చేసి వేధిస్తున్నారు. 

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి అవసరమైన నిబంధనలను సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఘటనలో ఉపయోగించిన ఆయుధం, స్వభావం, గాయం, దాడికి ఎంచుకున్న శరీర భాగం, ఉద్దేశాన్ని  నిర్ధారించుకుని మాత్రమే సెక్షన్ 307 పెట్టాల్సి ఉందని విపులీకరించింది. అయితే కుప్పంలో టీడీపీ మద్దతుదారులపై విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేసిన తర్వాత పోలీసులే సెక్షన్ 307 కింద మా కార్యకర్తలపై కేసులు పెట్టారు. 

నాడు డ్యూటీలో ఉన్న పోలీసులు పోలీసు యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్ ధరించలేదు. అదే తరహాలో నేడు కూడా మఫ్టీలో ఉన్న పోలీసులే బాధితులను అరెస్టు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అరెస్టుల సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలి... వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో తదితర వివరాలను లిఖిత పూర్వకంగా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.

ఈరోజు, కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈశ్వరప్ప, గణేశ్ లను యూనిఫాంలో లేని వ్యక్తులు వెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రకాశ్, వాసు, జమీర్, శేషులను కుప్పం రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో ‘ఇతరులు’ అని పేర్కొని, వారిని అరెస్టు చేశారు. ఇదే ధోరణి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ, పుంగనూరు, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతోంది. 

పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పోలీసులు మా పార్టీ కార్యకర్తలను నేరస్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించకుండా అధికార వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పోలీసులకు శిక్ష తప్పదు. 

పోలీసు శాఖ అధిపతిగా మీరు అధికార దుర్వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం చెయ్యాలి. ఇలాంటి వేధింపులు, అరెస్టులను వెంటనే ఆపాలి. కుప్పం, పుంగనూరు, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్రమంగా అదుపులోకి తీసుకున్న మా కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి" అంటూ డీజీపీని ఉద్దేశించి చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
Chandrababu
Letter
DGP
Arrests
TDP
Andhra Pradesh

More Telugu News