Cold Wave: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ఐదు రోజులుగా ఇదే పరిస్థితి.. పదేళ్లలో తొలిసారి!
- శీతల గాలులతో జనం ఇక్కట్లు
- ప్రతి రోజూ పదుల సంఖ్యలో విమానాలు
- రేపటి వరకు కొనసాగే అవకాశం
దేశ రాజధాని ఢిల్లీలో న్యూ ఇయర్ రోజు ప్రారంభమైన చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా పొగమంచు దట్టంగా కురుస్తూ ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. చలిగాలులు జనాన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటే హడలిపోతున్నారు. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దారి కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
కాగా, ఢిల్లీలో వరుసగా ఐదు రోజులపాటు ఇలాంటి వాతావరణం ఉండడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. 2013లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నా అప్పట్లో ఐదు రోజులకు మాత్రమే పరిమితమైంది. ఈసారి మాత్రం చలి వాతావరణం రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, దట్టమైన మంచు కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే, నేటి రాత్రి నుంచి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు దాదాపు 20 గంటలపాటు ఏకధాటిగా మంచు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ కనుచూపు మాత్రం 1000 మీటర్లకే పరిమితమైంది. అయితే, సాయంత్రం తర్వాత మళ్లీ పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ 600 మీటర్లకు పడిపోయింది.