Ponguleti Srinivasa Reddy: పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిని గౌరవించాలి: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivasa Reddy comments on media speculations

  • పొంగులేటి బీఆర్ఎస్ ను వీడతారంటూ ప్రచారం
  • కేసీఆర్, కేటీఆర్ పై నమ్మకంతోనే పార్టీలో చేరానన్న పొంగులేటి
  • తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని వెల్లడి
  • తెలంగాణ ప్రజలే తనకు గాడ్ ఫాదర్లు అని వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయన బీఆర్ఎస్ ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పినపాకలో నీకు పనేంటని కొందరు అంటున్నారని, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నాననో, పార్టీ మారడం లేదనో చెప్పడంలేదు... నా మనసులోని ఆవేదనను చెబుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్, కేటీఆర్ పై నమ్మకంతోనే నాడు టీఆర్ఎస్ లో చేరానని వెల్లడించారు. అయితే, నాలుగేళ్లుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. నిజాన్ని అప్పుడూ నిర్భయంగా చెప్పాను, ఇప్పుడూ చెబుతాను.... నా వ్యాపారలావాదేవీలపై త్వరలోనే చెబుతాను అని వెల్లడించారు.

'నేను సెక్యూరిటీ అడిగితే మీరు ఇవ్వలేదు... ఇప్పుడు నా భద్రత తగ్గించినా నేను అడగను, ఉన్న ఇద్దరు గన్ మన్లను తీసేసినా నేను బాధపడను... నాకు సెక్యూరిటీ అవసరంలేదు' అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. 

తనకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరని, తెలంగాణ ప్రజలే తనకు గాడ్ ఫాదర్లు అని వెల్లడించారు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా మనిషిని గౌరవించాలని అభిప్రాయపడ్డారు. పదవులు అవే వస్తాయి... పోయేటప్పుడు అవే పోతాయని అన్నారు. తానేమీ భూదందాలు చేయలేదని, గొంతెత్తకుండా మాత్రం ఉండలేనని స్పష్టం చేశారు.

అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదని, వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News