Renuka Chowdary: బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు: రేణుకాచౌదరి
- కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేణుక
- ఖమ్మంలోనే ఉంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ధీమా
- కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని వ్యాఖ్య
పార్టీ పేర్లు, రంగులు మార్చినంత మాత్రాన నాయకులను ప్రజలు నమ్మరని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు.
ఇక ఖమ్మం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఖమ్మంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో గెలిచి తీరుతామని చెప్పారు. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానంలో నాలుగు లక్షలకు పైగా ఓట్లను సాధించామని అన్నారు. తాను ఖమ్మంలోనే ఉంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాలేరు నుంచి పర్ణశాల వరకు అభివృద్ధి చేశానని తెలిపారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని... కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేణుక ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. హిందుత్వ ముసుగులో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో నిర్శహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.