Veerasimha Reddy: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
- సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య
- టికెట్ ధరలు పెంపు కోసం అనుమతి కోరిన మైత్రీ మూవీ మేకర్స్
- రూ.70 వరకు పెంచుకుంటామని విజ్ఞప్తి
- రూ.45 వరకు పెంచుకోవచ్చన్న ఏపీ సర్కారు
- తెలంగాణలో ఆరో షోకి అనుమతి
ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వస్తుండడంతో బాక్సాఫీసు వద్ద కోలాహలం తప్పదనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఈ రెండు సినిమాలకు అనుమతి నిచ్చింది. టికెట్ ధరలపై గరిష్ఠంగా రూ.45 వరకు పెంచుకునేందుకు పచ్చజెండా ఊపింది. అయితే ధర పెంపుపై జీఎస్టీ అదనం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.70 వరకు పెంచుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోరగా, ఏపీ సర్కారు రూ.45 వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
అటు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రెండు సినిమాల పట్ల ఉదారంగా స్పందించింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు ఆమోదం తెలిపింది. దాంతో, రిలీజ్ నాడు ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రదర్శించనున్నారు. మొత్తం 6 షోలు వేయనున్నారు.