Chandrababu: ఒక వర్గం పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారు: చంద్రబాబు
- వైసీపీ గూండాలతో చేతులు కలిపిన పోలీసులకు డీజీపీ మద్దతుగా నిలుస్తున్నారన్న చంద్రబాబు
- టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణలు
- యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్ లేకుండానే నిందితులను తీసుకెళ్తున్నారని విమర్శ
వైసీపీ గూండాలతో చేతులు కలిపిన కొందరు పోలీసులకు డీజీపీ కూడా మద్దతుగా నిలుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై నమోదు చేస్తున్న అక్రమ కేసులపై విమర్శలు గుప్పిస్తూ ఆయన డీజీపీకి లేఖ రాశారు. పుంగనూరులో టీడీపీ నేతలపై పోలీసులు లేదా రెవెన్యూ అధికారులు ఫిర్యాదుదారులుగా ఉంటున్నారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 307 లేదా ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు పెడుతున్నారని విమర్శించారు. మాచర్ల, కుప్పం, తంబళ్లపల్లె తదితర ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని చెప్పారు.
పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారనే విషయం కోర్టుల్లో రిమాండ్ ల తిరస్కరణల ద్వారా అర్థమవుతోందని చెప్పారు. ఒక వర్గం పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు యూనిఫాం లేకుండానే, నేమ్ బ్యాడ్జ్ ధరించకుండానే వచ్చి నిందితులను తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో అలాంటి పోలీసులను చట్ట ప్రకారం శిక్షిస్తారని చెప్పారు.