Australia: తాలిబన్ల చర్యను నిరసిస్తూ ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా

Australia withdraw from three match ODI series against Afghanistan after recent Taliban announcement
  • యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య ఈ మార్చిలో మూడు వన్డేల సిరీస్ 
  • బాలికలు, మహిళల విద్య, ఉపాధిపై తాలిబన్ల ఆంక్షల నేపథ్యంలో సిరీస్ నుంచి వైదొలిగిన ఆసీస్ జట్టు
  • మహిళల జట్టులోని ఐసీసీ శాశ్వత సభ్య దేశం ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలు, బాలికల విద్య, ఉపాధిపై అక్కడి తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలకు నిరసనగా ఆ జట్టుతో వన్డే సిరీస్ ను బహిష్కరించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి చివర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా ఆఫ్ఘన్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల భాగమైన ఈ సిరీస్ నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో ఆ జట్టు కీలక పాయింట్లు కోల్పోనుంది. మ్యాచ్ కి పది చొప్పున 30 పాయింట్లు ఆఫ్ఘన్ జట్టు ఖాతాలో చేరుతాయి.

ఈ సిరీస్ నుంచి ఎందుకు వైదొలిగామో క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల, మహిళల క్రికెట్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఆఫ్ఘన్ లో మహిళలు, బాలికలకు మెరుగైన పరిస్థితులను అంచనా వేయడానికి ఆ దేశ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతామని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ విషయంలో తమకు మద్దతు ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

ఆఫ్ఘన్‌లో ఇటీవలి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, మార్చిలో జరిగే తదుపరి బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని పరిశీలిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈవో జెఫ్ అలార్డిస్ చెప్పారు.  మహిళల జట్టు లేని ఏకైక ఐసీసీ శాశ్వత సభ్య దేశం ఆఫ్ఘనిస్థాన్ కావడం గమనార్హం. శనివారం ప్రారంభమయ్యే మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌లో ఆ దేశం ప్రాతినిథ్యం వహించడం లేదు.
Australia
Cricket
Afghanistan
odi
series
Taliban

More Telugu News