Gudivada Amarnath: మాకూ చేతులున్నాయి.. చెప్పులున్నాయి: పవన్‌పై మంత్రి అమర్‌నాథ్ ఫైర్
- సీఎంను చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిస్తారా? అని ఫైర్
- ప్రజలపై పవన్‌కు నమ్మకం లేదు కాబట్టే పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా
- చంద్రబాబు స్క్రిప్ట్‌ను యథాతథంగా చదివారన్న అమర్‌నాథ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రణస్థలంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కొట్టడానికి తమకూ చేతులు, చెప్పులు ఉన్నాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్లలో గత రాత్రి నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రణస్థలంలో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారన్నారు. చేతికి అందే దూరంలో ఉంటే సీఎంను కొడతానని అన్నారని, చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకూ చేతులు, చెప్పులు ఉన్నాయన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని మంత్రి సూచించారు.
తమకంటే పోరాడేవారు ఎవరూ లేరన్న పవన్ చివరికి ఒంటరిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని, తానొక ప్యాకేజీ స్టార్‌నని చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రజలపై పవన్‌కు నమ్మకం లేదని, అందుకనే ఒంటరిగా కాకుండా పొత్తులతో ముందుకెళ్తామని పవన్ స్పష్టం చేశారని విమర్శించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్.. ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్‌ను దూషించారని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును యథాతథంగా చదివారని మంత్రి విమర్శించారు.