Kashi: వారణాసి: టెంపుల్ సిటీలో టెంట్ సిటీ
- గంగా నదీ తీరంలో 100 హెక్టార్లలో ఏర్పాటు
- ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- ఏక కాలంలో 200 మంది వసతికి అనుకూలం
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో టెంట్ సిటీ ఏర్పాటైంది. గంగా నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. కాశీ విశ్వేశ్వరుడిని చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికితోడు శివరాత్రి తదితర పర్వదినాలు, సెలవు రోజుల్లో భారీగా వచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి సమస్య లేకుండా దీన్ని ఏర్పాటు చేశారు. టెంట్లతో నివాస కుటీరాలను నిర్మించారు. దీంతో కాశీకి వెళ్లిన వారు కాటేజీ లభించలేదన్న చింత లేకుండా ఈ టెంట్ హౌస్ లో బస చేయవచ్చు.
ఈ టెంట్ సిటీకి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ విభాగం హెడ్ అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బెనారస్ లో అందమైన టెంట్ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించినట్టు ప్రకటించారు. ‘‘కాశీలో పర్యాటకానికి ఇది పెద్ద ఊతమిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఘనమైన వారసత్వం ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు వస్తుంటారు’’ అని అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
గంగా ఘాట్ సమీపంలో 100 హెక్టార్లలో టెంట్ సిటీని నిర్మించారు. వారణాసి నుంచి రామ్ నగర్ వెళుతుంటే ఇది కనిపిస్తుంది. ఒకే విడత 200 మందికి ఇక్కడ వసతి ఉంది. గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలుగా ఉన్నాయి. చిన్నపాటి ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ తదితర అన్ని వసతులు ఉంటాయి. ప్రీమియం, డీలక్స్ టెంట్ రూమ్ కావాలంటే రూ.12,000-14,000 పెట్టుకోవాల్సిందే. ఈ నెల 14న నుంచి భక్తులకు ఇది అందుబాటులోకి వస్తుంది.