Rahul Gandhi: శరద్ యాదవ్ కూతురుని ఓదార్చిన రాహుల్ గాంధీ
- కిడ్నీ సమస్యలతో శరద్ యాదవ్ మృతి
- ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్న రాహుల్
- దేశానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వ్యాఖ్య
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 75 ఏళ్ల శరద్ యాదవ్ గురుగ్రామ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. చాలా కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. రెగ్యులర్ గా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. శరద్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమార్తెను ఓదార్చారు.
ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ, ఒకసారి ఒకే కారులో ఇద్దరం కలసి ప్రయాణించామని, అప్పుడే ఆయనతో తనకు అనుబంధం ఏర్పడిందని చెప్పారు. తన నానమ్మ ఇందిరాగాంధీతో అప్పట్లో విపక్ష నేత అయిన శరద్ యాదవ్ కు రాజకీయపరమైన విభేదాలు ఉండేవని... అయినప్పటికీ ఇద్దరి మధ్య గౌరవప్రదమైన అనుబంధాలు ఉండేవని చెప్పారు. ఎదుటి వ్యక్తుల గౌరవానికి భంగం కలిగేలా శరద్ యాదవ్ ఎప్పుడూ ప్రవర్తించలేదని రాహుల్ అన్నారు. రాజకీయాల్లో ఇది అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. దేశానికి శరద్ యాదవ్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.