YS Sharmila: కేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: వైఎస్ షర్మిల
- మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ ప్రసంగం
- కేసీఆర్ శ్రీరంగనీతులు చెబుతున్నాడన్న షర్మిల
- పోలీసులను పనోళ్లలా వాడుకుంటున్నారని ట్వీట్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. మహబూబాబాద్ లో కేసీఆర్ ప్రసంగంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని తెలిపారు.
"ప్రజల అభిప్రాయాలు గెలవాలట... ఇచ్చిన హామీలు నెరవేర్చాలట. నీ ఏలుబడిలో ఏనాడైనా ప్రజలను గౌరవించావా? ప్రజాస్వామ్యవాదులను ఆదరించావా? కనీసం జర్నలిస్టులకైనా గౌరవం ఇచ్చావా? గడీ దాటి నీ అడుగు బయటపడితే అక్రమ అరెస్టులు... నీ నోరు విప్పితే దొంగ హామీలు" అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. "అక్కర్లేని కాళేశ్వరం విషయంలో మొండిగా ముందుకెళ్లి, కట్టిన మూడేళ్లకే ముంచాడు. అందినకాడికి కమీషన్లు దోచుకున్నాడు" అంటూ ట్వీట్ చేశారు.
"నీ పాలనలో తెలంగాణ దూసుకెళుతోంది అభివృద్ధిలో కాదు దొరా... అప్పులు, ఆత్మహత్యల్లో దూసుకెళుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని దొర... ఎన్నికల్లో హామీ ఇస్తే నెరవేర్చాలని శ్రీరంగనీతులు చెబుతున్నాడు" అని పేర్కొన్నారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేర్చారా? అని షర్మిల సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
రైతు రుణమాఫీ ఏది? ఇంటికో ఉద్యోగం ఏది? డబుల్ బెడ్రూం ఇల్లు ఏది? దళితులకు మూడు ఎకరాల భూమి ఏది? నిరుద్యోగ భృతి ఏది? పోడు పట్టాలు ఏవి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణను అప్పుల పాల్జేసి, పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంత నిర్ణయాలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ, తెలంగాణలో దొరల పాలన సాగిస్తూ తాలిబన్ల రాజ్యంగా మార్చాడు అంటూ ధ్వజమెత్తారు.