GV Reddy: జగన్ దృష్టిలో పరిశ్రమలంటే టీ కొట్లు, కిళ్లీ కొట్లు, మాంసం దుకాణాలు, జిరాక్స్ షాపులే: టీడీపీ నేత జీవీ రెడ్డి
- సీఎం జగన్ తెచ్చిన పరిశ్రమలు ఏంటో చెప్పాలన్న జీవీ రెడ్డి
- అవేమైనా గాల్లో ఉన్నాయా అంటూ ఎద్దేవా
- టీడీపీ హయాంలో అనేక పరిశ్రమలు వచ్చాయని వెల్లడి
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తన ముఖం చూసే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని జగన్ రెడ్డి అంటే ప్రజలు నవ్వుతారని, జగన్ దృష్టిలో పరిశ్రమలంటే టీ కొట్లు, కిళ్లీ కొట్లు, మాంసం దుకాణాలు, జిరాక్స్ షాపులేనని వ్యంగ్యం ప్రదర్శించారు.
డీపీఐఐటీ నివేదిక ప్రస్తావిస్తూ... జగన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చానంటున్న రూ.15,693 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలన్నీ టీడీపీ ప్రభుత్వంలో జరిగినవేనని జీవీ రెడ్డి వెల్లడించారు. గ్రీన్ కో సోలార్ పరిశ్రమ, ఇసుజి మోటార్స్, రుచి సోయా, సెంబ్ కార్ప్ సంస్థలు ఏపీకి తానే తీసుకొచ్చినట్టు జగన్ రెడ్డి నిరూపించగలడా? అని సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వంలో రూ.11,944 కోట్ల పెట్టుబడులే వచ్చాయనడం మరో పచ్చి అబద్ధం అని స్పష్టం చేశారు.
"టీడీపీ ప్రభుత్వంలో రూ.39,450 కోట్ల పెట్టుబడులొస్తే, 5,13,000 ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వమే అసెంబ్లీలో చెప్పింది. జగన్ ముఖం చూసి వచ్చిన పరిశ్రమలు గాల్లో ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయో, యువతకు ఎన్నివేల ఉద్యోగాలు ఇచ్చాయో మంత్రులు, సాక్షి మీడియా చెప్పాలి. జగన్ దెబ్బతో రాష్ట్రంనుంచి పరారైన పరిశ్రమల జాబితా కొండవీటి చాంతాడంత ఉంటే, వచ్చిన పరిశ్రమలు సూదిమొనంతే.
అదానీ డేటా సెంటర్, లులూ గ్రూప్, అమర్ రాజా బ్యాటరీస్, కియా అనుబంధ పరిశ్రమలు, ఏషియన్ పేపర్ మిల్స్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ (తిరుపతి) అమరావతి స్టార్టప్ ప్రాజెక్ట్స్ వంటివన్నీ కలిపి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సైకో సీఎం రాష్ట్రం నుంచి తరిమేశాడు" అంటూ జీవీ రెడ్డి ధ్వజమెత్తారు.