Team India Hockey Team: హాకీ ప్రపంచకప్: స్పెయిన్‌ను చిత్తు చేసి శుభారంభం చేసిన భారత్

Hockey World Cup 2023 Team India won Against Spain
  • స్పెయిన్‌పై 2-0తో విజయం సాధించిన భారత జట్టు
  • ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించిన డిఫెన్స్ ఆటగాళ్లు
  • ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా అమిత్
  • పూల్-ఎ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం
  • పూల్-డిలో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న వేల్స్ చిత్తు
ఒడిశాలోని రూర్కెలాలో జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. పూల్-డిలో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించింది. తొలుత నెమ్మదిగా మ్యాచ్‌ను ప్రారంభించిన భారత జట్టు ఆ తర్వాత ప్రత్యర్థి గోల్‌పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను అర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ తర్వాత దక్కిన మరో పెనాల్టీ కార్నర్‌ను టీమిండియా సద్వినియోగం చేసుకుంది. అమిత్ రోహిదాస్ వేగంగా స్పందించి మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి పంపి భారత్ ఖాతా తెరిచాడు. 

ఆ తర్వాత హార్దిక్ సింగ్ గోల్‌పోస్టు సమీపంలో బంతిని పాస్ చేశాడు. అది ప్రత్యర్థి ఆటగాడి స్టిక్‌కు తగిలి గోల్‌పోస్టులోకి వెళ్లడంతో భారత్‌ ఆధిక్యం 2-0కి పెరిగింది. మూడో క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో భారత్ విఫలమైంది.  ఇంకోవైపు, గోల్స్ కోసం స్పెయిన్ తీవ్రంగా పోరాడినా భారత డిఫెన్స్ ఆటగాళ్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరి ఏడు నిమిషాల్లో స్పెయిన్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ భారత డిఫెన్స్ ఆటగాళ్లు విజయవంతంగా అడ్డుకోగలిగారు. దీంతో స్పెయిన్ ఖాతా తెరవలేకపోయింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ రోహిదాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

భువనేశ్వర్‌లో జరిగిన పూల్-ఎ  మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై ఆస్ట్రేలియా 8-0తో ఘన విజయం సాధించగా, రూర్కెలాలో జరిగిన పూల్-డి మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న వేల్స్‌పై 5-0తో ఇంగ్లండ్ విజయం సాధించింది.
Team India Hockey Team
Rourkela
Amit Rohidas
Hardik Singh
Hockey World Cup
Spain
Australia
England

More Telugu News