Harish Rao: రైతుబంధును దేశ వ్యాప్తంగా పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తాం: హరీశ్ రావు
- ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
- ఉద్యమ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందన్న హరీశ్
- మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలని వ్యాఖ్య
ఈ నెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ సభకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని మంత్రి హరీశ్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించిందని చెప్పారు. తమ ప్రభుత్వ పథకాలను రేపు దేశమంతా అమలు చేస్తామని అన్నారు.
రైతుబంధును పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తుందని తెలిపారు. మిషన్ కాకతీయను అమృత్ సరోవర్ పేరుతో బీఆర్ఎస్ అమలు చేస్తుందని అన్నారు. మతతత్వ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఇంటికి పంపిస్తేనే ప్రభుత్వ సంస్థలు మనుగడ సాగించగలవని చెప్పారు. దేశ వ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని అన్నారు. ఉద్యోగాలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? ఉద్యోగాలను తొలగించే బీజేపీ కావాలా? అని ప్రశ్నించారు.