Droupadi Murmu: రాష్ట్రపతి ముర్ముకు పాదాభివందనం చేసేందుకు ఓ మహిళా ఇంజినీర్ ప్రయత్నం... సస్పెన్షన్ వేటు
- ఈ నెల మొదటివారంలో రాష్ట్రపతి రాజస్థాన్ పర్యటన
- రోహెత్ లో స్కౌట్ గౌడ్ జంబోరీ కార్యక్రమం
- హాజరైన రాష్ట్రపతి ముర్ము
- ప్రోటోకాల్ ఉల్లంఘించిన జూనియర్ ఇంజినీర్ అంబా సియోల్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా అధికారి రాష్ట్రపతి ముర్ముకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా, ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ఆ అధికారిణి వ్యవహరించిందంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నెల మొదటి వారంలో ద్రౌపది ముర్ము రాజస్థాన్ పర్యటనకు వచ్చారు. రోహెత్ లో ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబా సియోల్ అనే మహిళా జూనియర్ ఇంజినీర్ ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించింది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వేచి ఉన్న అధికారులను దాటుకుని వెళ్లి మరీ ఆమె పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెను ముర్ము భద్రతా సిబ్బంది నిలువరించారు.
ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ రాజస్థాన్ సర్కారును ఆదేశించింది. దాంతో, అంబా సియోల్ పై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ నియామవళి ప్రకారం రూల్ నెం.958ని అనుసరించి సదరు అధికారిణిపై సస్పెన్షన్ వేటు వేశారు.