Iran: ఇరాన్‌లో కొనసాగుతున్న ఉరితీతల పర్వం.. మాజీ ఉన్నతాధికారికి శిక్ష అమలు!

Iran Executes British Iranian National Alireza Akbari Over Spying Allegations

  • బ్రిటన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలు
  • రక్షణశాఖ మాజీ ఉన్నతాధికారి అలీరెజా అక్బరీకి ఉరిశిక్ష అమలు
  • అనాగరిక చర్యగా పేర్కొన్న బ్రిటన్
  • అమెరికా సహా పలు దేశాల ఆగ్రహం

ఇరాన్‌లో ఉరితీతలు కొనసాగుతున్నాయి. వివిధ కారణాలతో గతేడాది నలుగురిని ఉరితీసిన ప్రభుత్వం తాజాగా మాజీ ఉన్నతాధికారి ఒకరిని ఉరితీసింది. బ్రిటన్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రక్షణశాఖ మాజీ ఉన్నతాధికారి అలీరెజా అక్బరీ(61)కి ఉరిశిక్ష అమలు చేసింది. అంతర్జాతీయ హెచ్చరికలను బేఖాతారు చేస్తూ ఉరిశిక్ష అమలు చేసింది. బ్రిటిష్-ఇరానియన్ అయిన అలీరెజాను ఉరితీయడంపై బ్రిటన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రజల హక్కులను గౌరవించని అనాగరిక ప్రభుత్వం తీసుకున్న ఓ క్రూరమైన పిరికిపంద చర్యగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ విమర్శించారు.

బ్రిటన్ నుంచి అలీ పెద్ద ఎత్తున నగదు తీసుకుని ఆ దేశ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎంఐ6)కు గూఢచారిగా మారారాన్నది ఇరాన్ అభియోగం. ఇవే ఆరోపణలపై 2019లోనే ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ ఈ విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. తాజాగా ఆయనకు ఉరిశిక్ష అమలు చేసినట్టు చెబుతున్నప్పటికీ ఎప్పుడు ఉరితీశారన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. అలాగే, అలీరెజాను చిత్రహింసలకు గురిచేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని అలీరెజా చెబుతున్న ఆడియో క్లిప్‌లు అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. అలీరెజాను ఉరితీయడంపై అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

  • Loading...

More Telugu News