Viral Videos: పైకప్పుకు తాకి 30 యార్డ్ సర్కిల్‌లోనే పడిన బంతి.. అయినా సిక్స్ ఇచ్చిన అంపైర్.. వీడియో ఇదిగో!

Viral Video Ball hits roof lands in 30 yard circle during BBL match umpire gives six
  • బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్-మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య పోరు
  • క్లోజ్‌డ్ స్టేడియం రూఫ్‌కు తాకిన బంతి
  • సిక్సర్‌గా ప్రకటించిన అంపైర్
  • ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ఘటన
  • ప్రపంచంలోనే తొలి క్లోజ్‌డ్ క్రికెట్ స్టేడియంగా డాక్‌ల్యాండ్స్‌కు గుర్తింపు
ప్రతిష్ఠాత్మక లీగ్ ‘బిగ్‌బాష్’లో భాగంగా నిన్న మెల్‌బోర్న్ స్టార్స్-మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య డాక్‌ల్యాండ్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓ సిక్సర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ జో క్లార్క్ కొట్టిన సిక్సర్ గురించి ఇప్పుడు క్రికెట్ ప్రేమికులు చర్చించుకుంటున్నారు. రెనెగేడ్స్ పేసర్ విల్ సుదర్‌లాండ్ వేసిన మూడో ఓవర్‌లో ఓ బంతిని జో క్లార్క్ బలంగా బాదాడు. అది కాస్తా నేరుగా వెళ్లి క్లోజ్‌డ్ స్టేడియంపై పైకప్పును తాకి తిరిగి మైదానంలోని 30 యార్డ్స్ సర్కిల్‌లో పడింది. అంపైర్ మరోమాటకు తావులేకుండా దానిని సిక్సర్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఆ తర్వాత 16వ ఓవర్‌లోనూ ఇలాగే జరిగింది. టామ్ రోడ్జెర్స్ బౌలింగులో బ్యూ వెబెస్టర్ కొట్టిన బంతి రూఫ్‌కు తాకి పిచ్‌కు సమీపంలో పడింది. అయినప్పటికీ అంపైర్ దానిని సిక్సర్‌గా ప్రకటించాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే, అప్పుడు ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించేవారు. రెండో సీజన్ తర్వాత ఈ నిబంధన మార్చారు.

అప్పట్లో రెనెగేడ్స్ సారథి అరోన్ ఫించ్ ఓ బంతిని బలంగా బాది రూఫ్ పైకి పంపాడు. ఇక, అప్పటి నుంచి బంతి పైకప్పును తాకితే దానిని సిక్సర్‌గా ప్రకటించాలని నిర్ణయించారు. మెల్‌బోర్న్‌లో విపరీతమైన వేడి కారణంగా మ్యాచ్‌లు జరుగుతున్న డాక్‌ల్యాండ్స్ స్టేడియం పైకప్పును మూసివేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇండోర్ రూఫ్ సౌకర్యం కలిగిన ప్రపంచంలోనే ఏకైక క్రికెట్ స్టేడియం ఇదే.
Viral Videos
BBL Match
Melbourne Stars
Melbourne Renegades
Docklands Stadium

More Telugu News