Peddireddi Ramachandra Reddy: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు: మంత్రి పెద్దిరెడ్డి
- పీలేరు సబ్ జైలు వద్దకు వచ్చిన చంద్రబాబు
- టీడీపీ కార్యకర్తలకు పరామర్శ
- పెద్దిరెడ్డి పనైపోయిందంటూ వ్యాఖ్యలు
- చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడన్న పెద్దిరెడ్డి
- కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయమని వెల్లడి
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇవాళ చంద్రబాబు పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం, పెద్దిరెడ్డి పనైపోయిందని, ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించడం తెలిసందే. ఈ నేపథ్యంలో, పెద్దిరెడ్డి ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేవలం తన కోసం, తన ఎల్లో మీడియా కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ను ప్రజలు ఎప్పుడో చించివేశారని అన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని, ఈసారి కుప్పంలో గెలిచేది వైసీపీయేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
ప్రజాసంక్షేమం కోసమే సీఎం జగన్ పనిచేస్తున్నారని, కానీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే చంద్రబాబు అజెండా అని విమర్శించారు. వచ్చే ఎన్నికలతో కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుట్రలను కుప్పం ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.
"ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం. ఆయన సాగించిన ప్రజాకంటక పాలన గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈసారి చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కడతారు... ఇది తథ్యం! ఏపీలో ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారు. చంద్రబాబు ఏడుపులను ప్రజలెవరూ నమ్మరు. చంద్రబాబు పని ఎప్పుడో అయిపోయింది... చిత్తూరు జిల్లాను వదిలి చంద్రబాబు ఎప్పుడో వెళ్లిపోయాడు" అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.