Paytm: యూపీఐ ద్వారా రోజుకు ఎంత నగదు బదిలీ చేసుకోవచ్చు?

Paytm PhonePe Google Pay Know The Maximum Amount You Can Transfer Using UPI In A Day
  • రోజుకు యూపీఐ నగదు బదిలీ పరిమితి రూ.లక్ష
  • ఒకే లావాదేవీ కింద రూ.లక్ష పంపుకోవడానికి అవకాశం
  • బ్యాంకుల వారీగా విడిగా ఒక్కో లావాదేవీపై పరిమితులు
యూపీఐ ద్వారా నగదు బదిలీ నేడు చాలా సాధారణమైపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య నగదు బదిలీ లావాదేవీలు సాధారణంగా జరుగుతుంటాయి. ఇప్పుడు హాస్పిటల్స్ నుంచి వర్తకుల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. కానీ, యూపీఐ ద్వారా నగదు బదిలీపై కొన్ని పరిమితులు ఉన్నాయని తెలుసా? యూపీఐని అభివృద్ది చేసి, దాని నిర్వహణ చూస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ స్వయంగా.. ఒక రోజులో ఒక యూజర్ కు రూ.లక్ష యూపీఐ పరిమితిని ఏర్పాటు చేయడం గమనించాలి. అన్ని రకాల యూపీఐలూ కలిపి రోజులో లక్ష పరిమితి అమలవుతుంది.

పేటీఎం
పేటీఎం నుంచి ఒక యూజర్ ఒక రోజులో రూ.లక్షను బదిలీ చేసుకోవచ్చు. అయితే ఒక గంటకు రూ.20,000 వరకు లావాదేవీలనే అనుమతిస్తోంది. ఒక గంటలో ఐదు లావాదేవీలే చేసుకోగలరు. ఒక రోజులో 20 లావాదేవీల పరిమితి అమల్లో ఉంది. 

ఫోన్ పే
ఒక యూజర్ ఒక రోజుకు రూ.లక్షను బదిలీ చేసుకోవచ్చు. ఒకే లావాదేవీ కింద రూ.లక్ష మొత్తాన్ని పంపుకోవచ్చు. 

గూగుల్ పే
రోజు మొత్తం మీద రూ.లక్ష వరకు నగదు బదిలీకి గూగుల్ పే సపోర్ట్ చేస్తుంది. ఒక రోజులో 10 సార్లకు మించి లావాదేవీలు చేసుకోలేరు. 

అమెజాన్ పే
ఒక యూజర్ అమెజాన్ పే ద్వారా రూ.లక్షను వేరొకరికి పంపించుకోవచ్చు. ఇలా రోజు మొత్తంలో రూ.లక్ష పరిమితికి లోబడి లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. 

బ్యాంకుల  వారీ పరిమితులు
పేటీఎం అయినా ఫోన్ పే అయినా వాటికి బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవడం ద్వారా యూపీఐ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమై పనిచేస్తుంది కనుక.. బ్యాంకులు సైతం యూపీఐ లావాదేవీల విలువపై పరిమితులు విధించాయి.

యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, సీఎస్ బీ, సిటీ యూనియన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఎస్ బీఐ తదితర బ్యాంకులు అన్నీ కూడా రోజు మొత్తం మీద రూ.లక్ష పరిమితిని యూపీఐ నగదు బదిలీలకు అమలు చేస్తున్నాయి. ఒకే లావాదేవీ కింద లేదంటే ఒకటికి మించిన లావాదేవీలు కింద రూ.లక్ష మొత్తాన్ని పంపుకోవచ్చు. కానీ, కొన్ని బ్యాంకులు రోజు మొత్తం మీద రూ.లక్షకు అనుమతిస్తున్నప్పటికీ, విడిగా ఒక్కో లావాదేవీకి రూ.5,000-10,000 పరిమితిని అమలు చేస్తున్నాయి.
Paytm
PhonePe
Google Pay
money transfer

More Telugu News