Nara Lokesh: అబద్ధానికి షర్టు, ప్యాంటు వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుంది: నారా లోకేశ్
- టీడీపీలో చేరిన కాండ్రు శ్రీనివాసరావు
- శ్రీనివాసరావు వైఎస్సార్ అభిమాని అని లోకేశ్ వెల్లడి
- వైఎస్ అభిమానులను జగన్ తరిమేస్తున్నాడని ఆరోపణ
- జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యలు
ఇవాళ మంగళగిరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ, కాండ్రు శ్రీనివాసరావు వైఎస్సార్ అభిమాని అని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీనివాసరావులాగే వైఎస్ అభిమానులు అందరినీ వైసీపీ నుంచి తరిమేస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలోకి కాండ్రు శ్రీనిసవారావుకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానన్నారు.
మునిసిపల్ చైర్మన్ గా మంగళగిరి పట్టణాన్ని శ్రీనివాసరావు ఎంతో అభివృద్ది చేశారన్నారు. వివాదాలకు దూరంగా ఉండి... ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే కాండ్రు శ్రీనివాసరావుకి పార్టీలో తగిన గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, నాయకులను గౌరవంగా పలకరిస్తామని, ఒక కార్యకర్తకు ఇబ్బంది వస్తే పార్టీ మొత్తం అండగా నిలిచే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి రంగాల్లో టీడీపీ క్యాడర్ కు అండగా పార్టీ నిలుస్తోందన్నారు.
అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డిలా ఉంటుందని, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టే అబద్ధాల రెడ్డి అని జగన్ కి పేరు పెట్టానన్నారు. జగన్ చెప్పిన మద్యపాన నిషేధం అబద్ధం, రూ.3 వేల పెన్షన్ అబద్ధం, జాబ్ క్యాలెండర్ అబద్ధం, ప్రత్యేక హోదా అబద్ధం, మూడు ముక్కల రాజధాని అబద్ధం... ఇలా జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు.
కష్టపడి సిఎంను చేసిన వైసీపీ కార్యకర్తలు, నాయకులకు జగన్ చేసిన ఒక్క మేలూ లేదన్నారు. టీడీపీలో సీనియర్లను, జూనియర్లను గౌరవిస్తానని, పని చేసే వారిని ప్రోత్సహిస్తానని అన్నారు. జగన్ సంక్షేమ పథకాలు పెంచుతూ పోతానని హామీ ఇచ్చి... కరెంట్, ఆర్టీసి చార్జీలు, ఇంటి, నీటి, చెత్త పన్నులు, పెట్రోల్ డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచాడని ఆరోపించారు. చివరికి మద్యం ధరలు కూడా పెంచేశాడని ఎద్దేవా చేశారు.
ఇక, మంగళగిరి ఎమ్మెల్యే నటన, వేషాలు చూసి 'కరకట్ట కమల్ హాసన్' అని పేరుపెట్టామన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కోసం వెళ్లింది కానీ, లేకపోతే మన 'కరకట్ట కమల్ హాసన్' ను పంపించి ఉంటే కచ్చితంగా ఆస్కార్ వస్తుందని ఎమ్మెల్యే ఆర్కేపై వ్యంగ్యం ప్రదర్శించారు. బర్రెలు, గొర్రెలతో ఫోటోలు దిగే ఎమ్మెల్యే... తన నియోజకవర్గంలో పెన్షన్ లు తొలగించిన 5 వేల మందితో ఫోటోలు దిగాలని సూచించారు.
మంగళగిరి నియోజకవర్గానికి వివిధ బడ్జెట్లలో సీఎం జగన్ రెడ్డి ఇస్తున్నట్టు ప్రకటించిన రూ.2600 కోట్లలో ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని ఎమ్మెల్యేని నిలదీశారు. నేను వస్తే ఇళ్లు పడగొడతానని ప్రచారంచేసిన కరకట్ట కమల్ ప్రతీ ఊరిలో ఇళ్లు ఎందుకు కూలగొడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. నియోజక వర్గంలో అక్రమంగా గ్రావెల్ తవ్వుతూ ఎన్ని కోట్లు కొల్లగొట్టారో ఎమ్మెల్యే వెల్లడించాలన్నారు.
ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదని, 13 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని లోకేశ్ చెప్పారు. మనం జగన్ రెడ్డిలా పరదాలు కట్టుకుని తిరగలేమన్నారు. చంద్రబాబుని సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని, తనపై 13కి పైగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పెన్షన్ లు తీసేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తి జగన్ రెడ్డి అని, అందుకే ఈ సైకో పాలన పోవాలి....సైకిల్ పాలన రావాలి అని పిలుపునిచ్చారు.