Team India: బెంబేలెత్తించిన బ్రేస్వెల్... ఓటమి తప్పించుకున్న టీమిండియా
- హైదరాబాదులో హోరాహోరీ పోరు
- తొలుత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసిన భారత్
- 49.2 ఓవర్లలో 337 పరుగులకు కివీస్ ఆలౌట్
- 78 బంతుల్లో 140 పరుగులు చేసిన బ్రేస్వెల్
న్యూజిలాండ్ ఆటగాడు మైకేల్ బ్రేస్వెల్ సంచలన ఇన్నింగ్స్ తో టీమిండియాను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లాడు. అయితే చివర్లో బ్రేస్వెల్ ను శార్దూల్ ఠాకూర్ ఓ యార్కర్ తో ఎల్బీడబ్ల్యూ చేయడంతో టీమిండియా 12 పరుగుల తేడాతో గట్టెక్కింది.
హైదరాబాదు వన్డేలో టీమిండియా నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌట్ అయింది. 78 బంతుల్లో 140 పరుగులు చేసిన బ్రేస్వెల్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ ఎడమచేతివాటం ఆటగాడు 12 ఫోర్లు, 10 భారీ సిక్స్ లతో భారత్ ను హడలెత్తించాడు.
ఆఖర్లో కివీస్ విజయానికి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, శార్దూల్ ఠాకూర్ విసిరిన తొలి బంతినే బ్రేస్వెల్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత బంతి వైడ్ గా వెళ్లడంతో సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అయితే, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో బ్రేస్వెల్ వీరోచిత ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు.
అసలు, న్యూజిలాండ్ ఇంత దూరం వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఓ దశలో ఆ జట్టు 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే, బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ జోడీ ఎదురుదాడికి దిగింది. దాంతో అసాధ్యమనుకున్న లక్ష్యం క్రమంగా కరిగిపోవడం ప్రారంభించింది. ఈ దశలో భారత్ భారీగా పరుగులు సమర్పించుకుంది. శాంట్నర్ 45 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అయితే శాంట్నర్ ను సిరాజ్ అవుట్ చేయడంతో భారత్ కు ఊరట లభించింది. అదే ఓవర్లో సిరాజ్... హెన్రీ షిప్లేను కూడా అవుట్ చేశాడు. ఆ తర్వాత లాకీ ఫెర్గుసన్ ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ కు పంపడంతో న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
టీమిండియా బౌలర్లలో సిరాజ్ 4, కుల్దీప్ యాదవ్ 2, శార్దూల్ ఠాకూర్ 2, షమీ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకుని విజృంభించారు. గతి తప్పిన బౌలింగ్ తో నిరాశపరిచిన పాండ్యా 7 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు.
అంతకుముందు టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (208) అద్భుతరీతిలో ఆడి డబుల్ సెంచరీ నమోదు చేయడం విశేషం. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో కివీస్ చివరి వరకు పోరాడి ఓడింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 21న రాయ్ పూర్ లో జరగనుంది.