Shardul Thakur: చివరి ఓవర్ లో శార్దూల్ మ్యాజిక్.. మ్యాచ్ ని గెలిపించిన యార్కర్
- ఉత్కంఠగా సాగిన భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్
- ఒంటరి పోరాటంతో కివీస్ ను గెలిపించినంత పనిచేసిన బ్రేస్ వెల్
- యార్కర్ తో అతడిని బోల్తా కొట్టించిన శార్దూల్ ఠాకూర్
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఇండియా, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ అభిమానులకు మరిచిపోలేని కిక్ ఇచ్చింది. శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తే.. 130 పరుగులకే 6 వికెట్లు తీసి బౌలర్లు విజయానికి బాటలు వేశారు. కానీ ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. అప్పుడే మొదలైంది విధ్వంసం.. భారత్ బౌలర్లపై ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్ వెల్ విరుచుకుపడ్డాడు.
లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తో కలిసి ఫోర్లు, సిక్సర్ల వరద పారించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేశాడు.. కేవలం 78 బంతుల్లో 140 రన్స్ బాదాడు. ఎప్పుడో అయిపోవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ దాకా వచ్చింది.. మనకు ఒక వికెట్ కావాలి.. వాళ్లకు 20 పరుగులు కావాలి. అటువైపు ఉన్నది బ్రేస్ వెల్.. గతేడాది ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో 20 పరుగులు బాదిన రికార్డు అతడికి ఉంది.
కోట్లాది మంది ప్రేక్షకుల్లో ఉత్కంఠ..
శార్దూల్ ఠాకూర్ వచ్చాడు.. మొదటి బంతి వేశాడో లేదో సిక్స్ బాదాడు బ్రేస్ వెల్.. రెండో బంతి వైడ్.. ఐదు బంతుల్లో 13 పరుగులు అవసరం.. అప్పుడే మ్యాజిక్ చేశాడు శార్దూల్.. యార్కర్ వేశాడు.. వికెట్లకు తగల్లేదు కానీ.. ప్యాడ్స్ తో అడ్డుకున్నాడు బ్రేస్ వెల్.. కానీ వికెట్ల ముందు దొరికిపోయాడు.. ఎల్ బీడబ్ల్యూ.. ఔట్.. ఉత్కంఠకు తెరపడింది. బ్రేస్ వెల్ భారీ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ను విజయం వరించింది. శార్దూల్ బౌలింగ్ వీడియోను ట్విట్టర్ లో ఓ యూజర్ పోస్ట్ చేశాడు.. మీరూ ఓ లుక్కేయండి మరి.