Air India: ఎయిరిండియా పీ గేట్: శంకర్ మిశ్రాపై నాలుగు నెలల నిషేధం

Air India Bans Shankar Mishra for 4 Months

  • విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసినట్టు శంకర్ మిశ్రాపై ఆరోపణలు
  • ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితుడు
  • ఇతర విమానయాన సంస్థలు కూడా నిషేధం విధించే అవకాశం

తమ విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రాపై ఎయిరిండియా నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. దీంతో ఇతర విమానయాన సంస్థలు కూడా ఆయనపై నిషేధం విధించే అవకాశం ఉంది. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేశాడు. 

ఈ ఘటన వెలుగులోకి వచ్చాక తీవ్ర దుమారం రేగింది. దీంతో స్పందించిన ఎయిరిండియా అప్పట్లో శంకర్ మిశ్రాపై నెల రోజుల నిషేధం విధించి చేతులు దులుపుకుంది. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది. అంత పెద్ద తప్పునకు ఇంత చిన్న శిక్షా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాలుగు నెలల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆ సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్, క్యాబిన్ సిబ్బందిపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

కాగా, బాధితురాలి ఫిర్యాదుపై ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు, ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న శంకర్ మిశ్రాను ఈ నెల 7న ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఆమెకు పరిహారం పంపించానని, సమస్య పరిష్కారమైందని, తొలుత పేర్కొన్న నిందితుడు ఇటీవల కోర్టులో మాట మార్చాడు. తాను ఆమెపై మూత్ర విసర్జన చేయలేదని, ఆమె భరతనాట్యం డ్యాన్సర్ అనీ, ఆ నాట్య కళాకారులు మూత్రాన్ని ఆపుకోలేరనీ, అందుకే తనే మూత్ర విసర్జన చేసుకుని ఉంటుందని ఆరోపించాడు. 

ఈ ఆరోపణలపై బాధితురాలు తీవ్రంగా స్పందించింది. చేసిన తప్పునకు పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి మళ్లీ ఇలాంటి ఆరోపణలా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడింది.

  • Loading...

More Telugu News