Vehicle Scrappage Policy: 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు ఏప్రిల్ 1 నుంచి ఇక తుక్కుకే!
- వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించాలని నిర్ణయం
- ఏప్రిల్ 1 నుంచి పాలసీ అమల్లోకి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలకు వర్తింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పాత వాహనాలపై రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేను సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను తుక్కుగా పరిగణించాలని నిర్ణయిచింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనుంది. ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రతకు వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. ప్రాథమిక రిజిస్ట్రేషన్ నమోదై 15 ఏళ్లు పూర్తయిన వాహనాలను చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలని ఉత్తుర్వుల్లో తెలిపింది.
2021-22 కేంద్ర బడ్జెట్ లోనే ఈ విధానాన్ని పేర్కొంది. ఈ విధానం మేరకు వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తరువాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తరువాత ఫిట్ నెస్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఫిట్ నెస్ లభించని వాహనాలను తుక్కు కోసం ఇవ్వాల్సి ఉంటుంది. పాత వాహనాలను తుక్కుగా మార్చిన తరువాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.